Sakshi News home page

బ్లాక్‌బోర్డుపై మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ పాఠాలు, వైరల్‌

Published Mon, Mar 19 2018 6:45 PM

Ghana Teacher Explains Microsoft Word On Blackboard, Goes Viral - Sakshi

ఘనా : ఎవరైనా మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ పాఠాలు చెప్పాలంటే, కచ్చితంగా కంప్యూటర్‌ను వాడాల్సిందే. కానీ కనీసం కంప్యూటర్‌ అంటే ఏంటో, ఎలా ఉంటుందో తెలియని ప్రాంతంలో మాత్రం ఆ పాఠాలు అసాధ్యమే. కానీ ఆ అసాధ్యానే సుసాధ్యం చేశారు ఘనాకు చెందిన ఓ టీచర్. బ్లాక్‌బోర్డుపై మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ పాఠాలు చెప్పి ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారారు. బ్లాక్‌బోర్డు సాయంతో ఆయన తన పిల్లలకు చెప్పిన మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ పాఠాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అక్కడితో అయిపోలేదు. వైరల్‌ అయిన తన ఫోటోలు, వీడియోల వల్ల, కంప్యూటర్లంటే ఏమిటో తెలియని ఘనా పట్టణంలో పిల్లలకు కంప్యూటర్‌ పరిజ్ఞానం అందించడానికి పలువురు ముందుకు వస్తున్నారు.
 
రిఛార్డ్‌ అప్పియా అకోటో అనే ఘనా ఓ పట్టణానికి చెందిన టీచర్‌, రంగుల ఛాక్‌పీస్‌లతో బ్లాక్‌బోర్డుపై కంప్యూటర్‌, మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ చిత్రాలు గీచి, పీసీ ఎలా వర్క్‌ చేస్తుందో వివరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటికి ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది. యూకేకి చెందిన ఓ సౌదీ పీహెచ్‌డీ స్టూడెంట్‌ బెటెనీజ్ ఎం- ఎ జూనియర్ హై స్కూల్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపింది. మన దేశీయ ఐటీ దిగ్గజం ఎన్‌ఐఐటీ కూడా ఆ పిల్లలకు సాయం చేయాలని భావించింది. 

‘ఫేస్‌బుక్‌లో వైరల్‌ అయిన ఈ న్యూస్‌ను చూశాం. ఆ టీచర్‌ అంకితభావం మా హృదయాలను తాకింది. ఆ స్కూల్‌ విద్యార్థులకు సాయం అందించాలని మేము నిర్ణయించాం’ అని ఎన్‌ఐఐటీ ఆశీష్‌ కుమార్‌ చెప్పారు. తమ గ్రూప్‌ సీఈవో కపిల్‌ గుప్తాతో ఈ విషయం గురించి చర్చించామని, ఐదు కొత్త డెస్క్‌టాప్‌లు, బుక్స్‌ను ఆ స్కూల్‌కు పంపించాలని నిర్ణయించామని తెలిపారు. సామాజిక, కార్పొరేట్‌ బాధ్యతగా ఆ టీచర్‌కు ఓ కొత్త ల్యాప్‌టాప్‌ను అందించనున్నామని చెప్పారు. కేవలం ఇది మాత్రమే కాక, మైక్రోసాఫ్ట్‌లో అకోటోకు స్పెషల్‌ ట్రైనింగ్‌ ఆఫర్‌ కూడా వచ్చింది. 

మైక్రోసాఫ్ట్‌ సింగపూర్‌ ఈవెంట్‌లో కూడా అకోటోకు ప్రశంసలు వర్షం కురిసింది. ‘మీ వర్క్‌ ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇది నిజంగా అద్భుతమైన ఆవిష్కరణ, అకింతభావం’ అని మైక్రోసాఫ్ట్‌ వరల్డ్‌వైడ్‌ ఎడ్యుకేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆంథోని సాల్సిటో అన్నారు.  ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఈ అనూహ్య స్పందనపై అకోటో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి  కంప్యూటర్లను చూస్తున్న విద్యార్థులు, ఎంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారని పేర్కొన్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement